మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కేసీఆర్ నిర్ణయం ఇదీ

  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు
  • డీలిమిటేషన్ బిల్లును పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని వెల్లడి
  • దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వెల్లడి
భారత ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై వారి మధ్య చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని, కానీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయానికి వస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అన్నారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుందని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఈ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలుకుతారని తెలిపారు. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా బిల్లు ఉంటే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం సీట్లు ఉన్నాయని గుర్తు చేశారు. పునర్విభజన తర్వాత ఈ శాతం ఏమాత్రం తగ్గకూడదని సూచించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.

బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. అంతవరకు మనం తొందరపడకూడదని పార్టీ నాయకులకు సూచించారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభ, ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

KCR
K Chandrasekhar Rao
BRS
Women Reservation Bill
Delimitation Bill
Telangana Politics
KTR

More Telugu News